తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణశాఖ.. ఈ మేరకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండనుంది. అటూ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.