ఈ వీకెండ్‌లో వర్షాలు కురుస్తాయి: ఐఎండీ
గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు ఆగస్టు నెలలో కురిశాయి.. అయితే సెప్టెంబర్‌లో మాత్రం నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుని వర్షాలు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
By అంజి Published on 1 Sept 2023 9:00 AM ISTThe IMD said that the southwest monsoon is picking up and there will be rain again
వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు చెంది ఎండ లు మండుతున్నాయి. కొద్దిరోజుల నుంచి కొడుతున్న ఎండలు ఎండకాలన్ని మైమరిపిస్తున్నాయి. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు ఆగస్టు నెలలో కురిశాయి.. అయితే సెప్టెంబర్‌లో మాత్రం నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుని వర్షాలు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు. ఈ వీకెండ్‌లో దక్షిణాదిలో, మధ్య భారతంలో వర్షాలు పడుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గురువారం నాడు మీడియా సమావేశంలో చెప్పారు. సెప్టెంబరు నెలకు దీర్ఘకాల సగటు వర్షపాతం 167.9 మి.మీ. అని, దీనిలో 9 శాతం అటూ ఇటూగా వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.
వర్షం ఎక్కువగా కురిసినా జూన్ - సెప్టెంబరు వానాకాలం సగటు వర్షపాతం మాత్రం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ''జులైలో అధిక వర్షాలు పడిన తర్వాత ఆగస్టులో చాలావరకు రుతుపవనాలు కనిపించకుండాపోయాయి. నెలలో 20 రోజులపాటు ఎక్కడా వర్షపు చినుకు పడలేదు. దీనికి కారణం ఎల్‌నినో పరిస్థితులు. అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల ఇప్పుడు ఎల్‌నినో సానుకూలంగా మారడం మొదలైంది. దీనికి తోడుగా తూర్పుదిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతుపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతోంది. దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది'' అని మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు.
మరోవైపు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తారు, భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు మూడు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.