తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్‌లో రెండు బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో ఒక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ విమానాశ్రయాల అభివృద్ధికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఇతర నియంత్రణ అధికారుల నుండి అవసరమైన అనుమతులు ఇవ్వడానికి ఆర్థిక ముగింపును సమర్పించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గురువారం లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు మాలోత్ కవిత, బీ వెంకటేశ్ నేత, జీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పౌరవిమానయాన శాఖ మంత్రి వీకే సింగ్ సమాధానమిచ్చారు.
జక్రాన్‌పల్లి (నిజామాబాద్ జిల్లా), పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం)లో మూడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు.జక్రాన్‌పల్లి (నిజామాబాద్ జిల్లా), పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం), దేవరకద్ర (మహబూబ్‌నగర్)లో మూడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలతో పాటు మమ్నూర్ (వరంగల్ జిల్లా), బసంత్ నగర్ (పెద్దపల్లి జిల్లా), ఆదిలాబాద్‌లో మూడు బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని పౌర విమానయాన శాఖ మంత్రి వీకే సింగ్ తెలిపారు.
దీని ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మొత్తం ఆరు విమానాశ్రయాలకు టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ (TEFS), అబ్స్టాకిల్ లిమిటేషన్ సర్ఫేసెస్ (OLS) సర్వే, సాయిల్ టెస్టింగ్, ఇతర పరీక్షలను నిర్వహించి జూన్ 2021లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలను సమర్పించింది. అధ్యయనం ప్రకారం.. వరంగల్ , ఆదిలాబాద్ (బ్రౌన్‌ఫీల్డ్), జక్రాన్‌పల్లి (గ్రీన్‌ఫీల్డ్)లలోని మూడు విమానాశ్రయాలు మాత్రమే సాంకేతికంగా సాధ్యమయ్యేవిగా కనిపిస్తున్నాయని తెలిపింది.