తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో పోలీసులు బండి సంజయ్‌ని కరీంనగర్ జైలుకు తరలించారు. సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జనవరి 17వ తేదీ వరకు రిమాండ్ విధించింది. బండి సంజయ్‌తో పాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు కూడా కోర్టు రిమాండ్ విధించింది. అయితే మరో 11 మంది పరారీలో ఉన్నారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆదివారం రాత్రి 317 జీవో పేరుతో కరీంనగర్‌లో జాగరణ దీక్ష చేపట్టారు.
అయితే కొవిడ్ నిబంధనలు అతి క్రమించి దీక్ష చేపట్టారని పోలీసులు దాదాపు 3 గంటల హైడ్రామా తర్వాత బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి బండి సంజయ్‌ను కోర్టుకు తరలించారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం బండి సంజయ్‌కి బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే జైలులో బండి సంజయ్‌కి ఇచ్చే ఆహారాన్ని జైలర్ రుచి చూశాకే ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా.. అందుకు కోర్టు సమ్మతించింది.
మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ తీరు దారుణమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తలుపులు పగలగొట్టి, భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. సొంత కార్యాలయాల్లో దీక్ష చేస్తున్నా.. సాకులు చెప్పి అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. అయితే ఉపాధ్యాయుల తరఫున తమ పోరాటం సాగుతుందని జేపీ నడ్డా పేర్కొన్నారు.