హైదరాబాద్‌ శివారు నుంచి దసరాకు ప్రత్యేక బస్సులు

దసరా, బతుకమ్మ పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల స్పెషల్‌ బస్సులు నడుపుతున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.

By అంజి  Published on  1 Oct 2024 7:27 AM IST
TGSRTC,  special buses, Dussehra, Telangana

గుడ్‌న్యూస్‌ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు

దసరా, బతుకమ్మ పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల స్పెషల్‌ బస్సులు నడుపుతున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి 15 వరకు తెలంగాణ నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ఈ బస్సులు నడుపుతున్నామంది. ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, ఆరాంఘర్‌, కేపీహెచ్‌బీ నుంచి సర్వీసులు ఉంటాయంది. విజయవాడ, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సమాయాభావం తగ్గించేలా గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా బస్సులు తిప్పుతామంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు.

దసరా పండుగకు ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై క్షేత్రస్థాయి అధికారులతో ఎండీ సజ్జనార్‌ వర్చువల్‌గా సమావేశమయ్యారు. గత దసరాతో పోల్చితే ఈ సారి మహాలక్ష్మీ పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, గతంలో మాదిరిగానే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. అక్టోబర్‌ 12న దసరా పండుగు ఉన్నందున.. 9,10,11 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఆయా రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని అధికారుకుల సూచించారు. రద్దీ రోజుల్లో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులకు టోల్‌ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story