దేశంలోనే తొలిసారి..TGSRTCలో ఏఐ వినియోగం

దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్ర‌జా ర‌వాణా సంస్థ‌గా టీజీఎస్ఆర్టీసీ నిలిచింది

By -  Knakam Karthik
Published on : 24 Sept 2025 3:30 PM IST

Telangana, TGSRTC, public transport, AI

హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త‌మ సేవ‌ల‌ను మెరుగుప‌రుచుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ మరో గొప్ప అడుగు వేసింది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ)ను విస్తృతంగా వినియోగించాలని నిర్ణ‌యించింది. త‌మ ఉత్పాదకత పెంపు, సిబ్బంది ప‌నితీరు, ఆరోగ్య స్థితి ప‌ర్య‌వేక్షణ‌, ఖర్చుల తగ్గింపు, ర‌ద్దీకి అనుగుణంగా స‌ర్వీసుల‌ ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్ర‌జా ర‌వాణా సంస్థ‌గా టీజీఎస్ఆర్టీసీ నిలిచింది. ఏఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థ టీజీఎస్ఆర్టీసీకి తోడ్పాటును అందిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తోంది. సంస్థ‌లో ఏఐ వినియోగం కోసం ఒక ప్ర‌త్యేక టీంను యాజ‌మాన్యం ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారుల‌ను గుర్తించి.. ఆ టీంలో ప్రాధాన్యం ఇచ్చింది. ఏఐ వాడ‌కంపై ఆ టీమ్‌కు హన్స ఈక్విటీ పార్ట్‌న‌ర్స్ శిక్ష‌ణ ఇస్తోంది.

ఏఐ ప్రాజెక్టులో భాగంగా మొద‌ట‌గా 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌లో భాగంగా ఉద్యోగుల‌కు చేసిన వైద్య ప‌రీక్ష‌ల ఆధారంగా ఆరోగ్య ప‌రిస్థితిన ఏఐ, మెషిన్ లెర్నింగ్ స‌హ‌కారంతో అంచ‌నా వేస్తున్నారు. మొద‌ట పైల‌ట్ ప్రాజెక్ట్‌గా ఆరు డిపోల్లో అమ‌లు చేయ‌గా మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అన్ని డిపోల్లోనూ ఈ ప్రాజెక్టును అమ‌లు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఏఐ ద్వారా ఆటోమెటిక్ షెడ్యూలింగ్‌ను సంస్థ ప్లాన్ చేస్తోంది.

రోజు, తిథి, పండుగులు, వారాల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ స‌హ‌కారంతో ప్ర‌యాణికుల ర‌ద్దీని అంచ‌నా వేసి.. ఆ మేర‌కు బ‌స్సుల‌ను సంస్థ ఏర్పాటు చేయ‌నుంది.

టీజీఎస్ఆర్టీసీలో ఏఐ ప్రాజెక్ట్ అమ‌లు తీరు గురించి హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సచివాల‌యంలో ఇటీవ‌ల ర‌వాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆధునిక రవాణా అవసరాలకు అనుగుణంగా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడం కోసం 2021 నుంచే అమలు చేస్తున్న స్ట్రాటజిక్ డిప్లాయ్‌మెంట్ ప్లాన్ (ఎస్డీపీ) కీలక పాత్ర పోషిస్తున్నదని మంత్రి గారి దృష్టికి ఆర్టీసీ ఉన్నతాధికారులు తీసుకెళ్లారు

ప్రతి నెలా ఎస్‌డీపీ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ, స్వల్పకాలిక – దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి అమలులో సంస్థ చురుకైన చర్యలు తీసుకుంటున్నదని వివ‌రించారు. త‌మ పనితీరు మెరుగుపరచుకోవడానికి ఏఐని వినియోగించుకోవ‌డంపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సంతోషం వ్య‌క్తం చేస్తూ.. ఆర్టీసీ ఉన్న‌తాధికారుల కృషిని అభినందించారు. ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ఏఐ ప్ర‌భావితం చేయ‌ని రంగ‌మే లేద‌ని, ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో మార్పుల‌ను గుర్తించి.. ప్ర‌జ‌ల ర‌వాణా అవ‌సరాల‌కు అనుగుణంగా ఏఐని వినియోగించుకోవాల‌ని భావించ‌డం గొప్ప విష‌య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ ఏఐ ప్రాజెక్ట్ అమ‌లుకు సమష్టిగా ప‌నిచేసి.. ఆర్టీసీ మరింత అభివృద్ధి సాధించేలా అధికారులందరూ కృషి చేయాలని సూచించారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములుగా పనిచేస్తూ 2021 నుంచి కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్‌) కింద ఎస్‌డీపీ అమలు, ఏఐ ప్రాజెక్ట్ రూపకల్పనలో విశేషంగా తోడ్పడిన హన్స ఈక్విటీ పార్ట్నర్స్ ఎల్ఎల్‌పీకి చెందిన త్రినాధబాబు, సునీల్ రేగుళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.సంస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేయడం కోసమే ఏఐ ప్రాజెక్ట్‌ను అమ‌లు చేస్తున్నామ‌ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఏఐ వినియోగం వ‌ల్ల సేవ‌ల్లో మరింతవేగం, కచ్చితత్వం, స్పష్టత ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. ప్రయాణికుల అవసరాలు, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి స్మార్ట్ షెడ్యూలింగ్ సాధ్యమవుతుంద‌ని చెప్పారు. ప్రజా రవాణా రంగంలో సాంకేతికతను వినియోగించి దేశంలోనే తొలి మోడల్‌గా టీజీఎస్ఆర్టీసీ నిల‌వ‌డం గర్వకారణమ‌ని అన్నారు.

Next Story