తెలంగాణలో ఫ్రీ బస్ జర్నీపై ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఈ పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik
తెలంగాణలో ఫ్రీ బస్ జర్నీపై ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఈ పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర బస్సుల్లో ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, తదితర గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించి జీరో టికెట్లు పొందవచ్చని తెలిపారు. కాగా ఓ నెటిజన్ ఆధార్ కార్డు మాత్రమే వ్యక్తి గుర్తింపు ఐడీ కాదని సోషల్ మీడియాలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ట్యాగ్ చేసి ప్రశ్నించగా అతనికి సమాధానంగా ఈ విషయం చెప్పారు. ఆధార్ కార్డు లేని వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లను చూపించి ఉచిత టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (మహాలక్ష్మి పథకం) కల్పించింది. ఈ పథకం తెలంగాణ మహిళలకు అందరికీ వర్తింపజేశారు. రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడిచే అన్ని పల్లే వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఆధార్ కార్డుతో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు.