అరగంట ముందే గేటుకు తాళాలు వేస్తాం.. గ్రూప్‌-2 అభ్యర్థుల‌కు టీజీపీఎస్సీ చైర్మన్ అల‌ర్ట్‌..!

ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 నిర్వహిస్తున్నామ‌ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.

By Medi Samrat  Published on  14 Dec 2024 11:43 AM GMT
అరగంట ముందే గేటుకు తాళాలు వేస్తాం.. గ్రూప్‌-2 అభ్యర్థుల‌కు టీజీపీఎస్సీ చైర్మన్ అల‌ర్ట్‌..!

ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 నిర్వహిస్తున్నామ‌ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. 5.51 లక్షల మంది అభ్యర్థులు ప‌రీక్ష‌లు రాయ‌నున్నార‌ని వెల్ల‌డించారు. 2022లో నోటిఫికేషన్ ఇచ్చాము.. గత వారంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కేసుల నుంచి గెలిచామ‌ని గుర్తుచేశారు. 1,358 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ‌హిస్తామ‌ని.. 49,848 మంది సిబ్బంది ప్ర‌త్య‌క్షంగా.. పరోక్షంగా అందరితో కలిపి ఓవరాల్ గా 75 వేలమంది సిబ్బంది విధుల్లో ఉంటున్నారని తెలిపారు.

75 శాతం మంది ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని.. 783 పోస్టులకు పరీక్ష నిర్వ‌హిస్తున్నామ‌ని.. ఒక్కో ఉద్యోగానికి కనీసం 70 మంది పోటీప‌డుతున్నార‌ని.. ఆ ఒక్క పోస్ట్ నాదే అనే కాన్ఫిడెన్స్ తో పరీక్ష రాయండని సూచించారు. ఎలాంటి అపోహలు వద్దు.. మెరిట్ వచ్చేలా చూసుకోండి.. ఉద్యోగం మీదేన‌న్నారు. OMR షీట్ ను అభ్యర్థులు పక్కాగా చెక్ చేసుకోవాలి.. ఎవరి OMR షీట్ వారికే ఉంటుందన్నారు. బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసేందుకు వీలు లేదు.. ఏదయినా పరిస్థితిలో పరీక్ష రాసినా అది వ్యాలీడ్ కాదు.. వాల్యుయేషన్ అవ్వదన్నారు.

గ్రూప్ 2 గతంలో ఇచ్చినపుడు భర్తీకి 4 ఏండ్ల సమయం పట్టింది.. 2015 నుంచి 2019 వరకు టైం పట్టింది.. ఈసారి తక్కువ సమయంలో భర్తీ చేస్తున్నామ‌ని తెలిపారు. గ్రూప్ 2 కు పూర్తిస్థాయిలో మేము సన్నద్ధంగా ఉన్నామ‌న్నారు. TGPSC ని, మీ మెరిట్ ను నమ్మండి.. TGPSC మీ మదర్ లాంటిది.. ఎలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయండి.. ప‌రీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని తెలిపారు. 58 స్టోరేజీ పాయింట్లలో OMR షీట్లు, ప్రశ్న పత్రాలు ఉంచిన‌ట్లు తెలిపారు. అభ్యర్థులకు తప్ప అందులో ఏ ప్రశ్నలు ఉన్నాయో ఎవరికీ తెలియదన్నారు.

TGPSC ప్రక్షాళన కోసం ఢిల్లీకి TGPSC సభ్యులు ఈనెల 18, 19 తేదీల్లో వెళ్తున్నామ‌ని.. 18న ఉదయం UPSC ఆఫీస్ లో గైడ్ లైన్స్ తీసుకుంటాం.. 19న SSC కమిషన్ ఆఫీస్ కు వెళ్తున్నాం.. సాయంత్రం NTA చైర్మన్ తో భేటీ ఉంటుంద‌ని తెలిపారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహణ కోసం అధ్యయనం చేసేందుకు వెళ్తున్నామ‌న్నారు. జనవరి నాటికి ప్రభుత్వానికి దీనిపై నివేదిక అందజేసి తర్వాత రిక్రూట్ మెంట్ కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతామ‌ని తెలిపారు.

కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, UP పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణలో పర్యటించనుంది.. జనవరిలో వారు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. UPSC కేవలం 5 వేల అభ్యర్థుల నియామకాలపై మాత్రమే ఫోకస్ పెడుతోంది.. TGPSC కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని సెక్షన్లలో నియామకాలు చేపడుతోంది.. TGPSC అంటే కమిట్ మెంట్, స్పీడ్ అనేది అభ్యర్థులకు నమ్మకం కలిగేలా చూస్తామ‌న్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి వాటిని 6 నుంచి 9 నెలల్లో పరీక్ష ప్రక్రియ పూర్తిచేస్తామ‌న్నారు. సింగిల్ పరీక్ష ఉన్నవాటిని 6 నెలల్లోనే భర్తీ చేస్తామ‌న్నారు. జనవరి నుంచి మార్చి మధ్యలో గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తామ‌ని తెలిపారు.

నేను ఇటీవల TGPSC చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నా.. సిలబస్ మాత్రమే మేము ఇస్తాం.. ఏ పుస్తకాలు చదవాలన్నది మేము చెప్పం.. అది అభ్యర్థుల ఇష్టం.. ఎందుకంటే మేము ఎలాంటి పుస్తకాలు ముద్రణ చేయడం లేదు.. ఏ పుస్తకాలు చదవాలన్నది మేము చెప్పకూడదన్నారు. కొత్త నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసి జనవరి నాటికి కొత్త నోటిఫికేషన్ పై స్పష్టత ఇస్తామ‌న్నారు. అరగంట ముందే గేటుకు తాళాలు వేస్తాం.. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు వెళ్లిపోవాలన్నారు. తేదీలు క్లాష్ అయితే.. 5 వేల మంది రాసే పరీక్ష కోసం 5 లక్షల మంది అభ్యర్థుల జీవితాలను ఇరకాటంలో పెట్టలేమన్నారు.

TGPSC చిన్న సంస్థ.. కానీ రాష్ట్రస్థాయిలో అన్ని నియామకాలు చేపట్టే సంస్థ అన్నారు. అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లపై స్పష్టత ఇచ్చాం.. CBT పరీక్ష నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గ్రూప్ 2 పరీక్షను కూడా CBT విధానంలో నిర్వహించవచ్చు.. కానీ 28 వేల మంది రాసేందుకు మాత్రమే అవకాశం ఉంది.. దీనివల్ల పరీక్షకు 25 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. మార్చి నెలాఖరులో గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తాం.. TGPSC లో కొత్తగా 80 మందిని డిప్యుటేషన్ విధానంలోతీసుకుంటున్నామ‌ని తెలిపారు.

Next Story