ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..కంచ గచ్చిబౌలి వివాదంపై TGIIC ప్రకటన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik
ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..కంచ గచ్చిబౌలి వివాదంపై TGIIC ప్రకటన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ఇందులో సెంట్రల్ యూనివర్సిటీ చెందిన భూమి లేదని స్పష్టం ప్రకటన విడుదల చేసింది.
2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూమిని ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టులోని ఈ కేసుల్లో చట్టపరంగా గెలిచి ఈ భూమికి సంబంధించిన యాజమాన్యాన్ని దక్కించుకుందని వెల్లడించింది. దీనిపై ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వం స్థానిక సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రాజెక్టును వ్యతిరేకించే వారు రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఈ భూములపై తప్పుదోవ పట్టించే కథనాలు టీజీఐఐసీ దృష్టికి రావడంతో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నట్లు పేర్కొంది.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ఈ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకుంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవు. సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాజెక్ట్ను వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 400ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. 400 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది. దీనిలో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది” అని టీజీఐఐసీ పేర్కొంది.