Telangana: న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో డీజీపీకి HRC నోటీసులు
న్యాయవాది స్వప్న కుమారి హత్య కేసులో పోలీసుల పాత్రపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGSHRC) సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
By - Knakam Karthik |
Telangana: న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో డీజీపీకి HRC నోటీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది స్వప్న కుమారి హత్య కేసులో పోలీసుల పాత్రపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGSHRC) సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని బాధితురాలు గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు స్పందించకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా స్వప్న హత్యను నిరోధించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ, మొయినాబాద్ పోలీసుల తీవ్ర నిర్లక్ష్యంపై 163 మంది న్యాయవాదుల బృందం ఫిర్యాదు చేసింది.
మృతురాలు తన సోదరుడు గోటికే రాజు తనను చంపేస్తామని బెదిరించాడని అనుమానితుడిగా పేర్కొంటూ గతంలో అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు సకాలంలో నివారణ చర్యలు తీసుకోలేదని, ఇది నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును విచారించిన జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని టీజీహెచ్‌ఆర్‌సీ, ఈ కేసుపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డిని ఆదేశించించడంతో పాటు తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.
ఈ విషయంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సాక్షులకు రక్షణ కల్పించాలని, స్వప్న తల్లికి మధ్యంతర పరిహారం ఇవ్వాలని, ఛార్జిషీట్‌ను త్వరగా సమర్పించాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు.
ఏం జరిగింది?
న్యాయవాది స్వప్న కుమారిని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఫిబ్రవరి 4న మొయినాబాద్‌లో జరిగిన స్వప్న హత్య కేసులో ఆమె సోదరుడు గోటికే రాజుతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న, అన్నదమ్ముల మధ్య భూ వివాదం కారణంగా కేతిరెడ్డిపల్లిలో ఆమె సోదరుడు చేతిలో హత్యకు గురయ్యారు.
స్వప్న తన తల్లి, సర్వేయర్ తో కలిసి కేతిరెడ్డిపల్లిలోని నాలుగు ఎకరాల భూమిని సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ఈ హత్య జరిగింది. వారు తిరిగి వస్తుండగా రాజుతో పాటు మరో ముగ్గురు కారులో వచ్చి స్వప్నను ఢీకొట్టారు. ఆమె కిందపడగానే, నిందితులు స్వప్నను కర్రలు, రాళ్లతో దాడి చేసి, కత్తితో స్వప్న గొంతు కోసినట్లు మొయినాబాద్ పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.