తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

By అంజి  Published on  27 March 2024 9:28 AM IST
Temperatures, Telangana , IMD, Summer

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దీంతో ఆరుబయట పని చేసేవారు, పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎండలో తిరగరాదని హెచ్చరిస్తున్నారు.

నిన్న ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తలమడుగు, జైనథ్‌ మండలాల్లో గరిష్టంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

భారతదేశ వ్యాప్తంగా కూడా ఎండలు పెరిగాయి. మార్చి నుంచి జూన్‌ మధ్య వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఈసీ అప్రమత్తం అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సీఈసీ లెటర్‌ రాసింది. పోలింగ్‌ కేంద్ఆరల వద్ద తాగునీరు, సరైన నీడ, మెడికల్‌ కిట్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

Next Story