తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు

Temperatures are dropping day by day in Telangana. తెలంగాణలో ఆదివారం రాత్రి తీవ్రమైన చలిగాలులు వీచాయి. దీంతో కొన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

By అంజి  Published on  21 Nov 2022 3:37 AM GMT
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఆదివారం రాత్రి తీవ్రమైన చలిగాలులు వీచాయి. దీంతో కొన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనం గజగజ వణుకుతున్నారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. గత 24 గంటల్లో కొమరం భీమ్‌లోని సిర్పూర్‌లో రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 7.3 ° సెల్సియస్ నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్ శివారు నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. అంతకుముందు 2017 నవంబర్‌ నెలలో ఆదిలాబాద్‌లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే. మరికొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. నిన్న అత్యల్పంగా భద్రాచలంలో 27 డిగ్రీలు, హైదరాబాద్‌లో 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయని, దీని కారణంగానే రాష్ట్రంలో చలి తీవ్రత పెరగిందని అధికారులు తెలిపారు.

రాబోయే రోజులలో వాతావరణ సూచన

ఐఎండీ వాతావరణ సూచన ప్రకారం.. నేడు తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది. నవంబర్ 22న, రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. మరోవైపు "తెలంగాణ వెదర్‌మ్యాన్" టి. బాలాజీ మాట్లాడుతూ.. నవంబర్ 21 నుండి 23 వరకు కొంత విరామం ఉంటుందని, నవంబర్ 23 నుండి మళ్లీ సుదీర్ఘ చలిగాలులు వీచే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. గత 10 ఏళ్లలో అత్యంత బలమైన చలిగాలులు వీచిన 2018-19 శీతాకాలాలకు ఈ శీతాకాలం గట్టి పోటీని ఇవ్వబోతోందని ఆయన తెలిపారు.

Next Story