తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇంతకూ ఏమి జరిగిందంటే..

Telugu States Border Issue. కర్నూలు జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా అంబులెన్స్‌లు నిలిచిపోయిన

By Medi Samrat  Published on  14 May 2021 2:02 PM GMT
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇంతకూ ఏమి జరిగిందంటే..

కర్నూలు జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా అంబులెన్స్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే..! హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. చాలా మంది రోగులను కర్నూలు టోల్ ప్లాజా దగ్గర ఆపేస్తూ ఉన్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ మాట్లాడుకున్నామని, కాళ్లు మొక్కుతామని తిరుపతికి చెందిన ఓ మహిళ వేడుకున్నా తెలంగాణ పోలీసులు కనికరించలేదు. ఇలా చాలా మంది వెనక్కు వెళ్లిపోయారు.

హైదరాబాద్‌లో చికిత్స కోసం వచ్చే రోగులు హైదరాబాద్ ఆసుపత్రులలో ముందుగా బెడ్ ను రిజర్వ్ చేసుకుని వుంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తారని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ వివరాలను కంట్రోల్ రూము (040 2465119, 9494438251)కు కానీ, లేదంటే idsp@telangana.gov.in వెబ్‌సైట్‌కు కానీ ఆయా ఆసుపత్రులు తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్ పేరు, మొబైల్ నంబరు, టైఫ్ ఆఫ్ బెడ్ వంటి వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రోగుల వాహనాలు రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు ఈ వివరాలను చెబితే అనుమతిస్తారు. ఇందుకోసం సరిహద్దుల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఏపీ నుంచి కరోనా పేషెంట్లతో వస్తున్న అంబులెన్సులను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఆర్ఎస్ అధికారి గరిమళ్ల వెంకటకృష్ణారావు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన హై కోర్టు తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై స్టే విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుండడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను నిలుపుదల చేసిన హైకోర్టు అంబులెన్సులు ఆపేందుకు వీల్లేదని తెలంగాణ పోలీసు శాఖకు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం పాత సర్క్యులర్ లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్ ఇవ్వాలని ఆదేశించింది.

అంతకుముందు తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పినప్పటికీ తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. ఏపీలోని కరోనా పేషెంట్లు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, ఏ రాష్ట్రానికి లేని సమస్య తెలంగాణకే ఎందుకని ప్రశ్నించారు. ఈ అంశాన్ని మానవత్వంతో చూడాలని అన్నారు.


Next Story