తెలంగాణ నీరు, విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోదు: సీఎం రేవంత్
విద్యుత్ డిమాండ్, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
By అంజి Published on 31 March 2024 1:24 AM GMTతెలంగాణ నీరు, విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోదు: సీఎం రేవంత్
మండుతున్న ఎండలు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, తాగునీటి సరఫరా పరిస్థితులను ఆయన సమీక్షించారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి అత్యధికంగా విద్యుత్ సరఫరా చేసి ప్రభుత్వం కొత్త రికార్డు సాధించింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు.
రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల విద్యుత్తు లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14,000 మెగా వాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దాంతో వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గత ఏడాది (2023) జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయింది. 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రోజుకు సగటున 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరిగింది.
గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు సరఫరా అత్యధిక రికార్డు కాగా.. ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలి. బోర్ వెల్స్, బావులన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలి. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరేలా చర్యలు తీసుకోవాలి.