వరంగల్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య..?
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 April 2024 3:30 PM ISTవరంగల్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య..?
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో.. ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీలకు క్యూ కట్టారు. ఈ క్రమంలో వరంగల్ లోక్‌సభ స్థానం బీఆర్ఎస్ టికెట్‌ను దక్కించుకున్న కడియం కావ్య కూడా బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆమె టికెట్‌ను నిరాకరిస్తున్నట్లు స్వయంగా కేసీఆర్‌కు లేఖ కూడా రాశారు. దాంతో.. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా ఇప్పుడు కేసీఆర్ ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది.
వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య ను ఫైనల్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నుంచి రాజయ్యకు పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాంతో రాజయ్య ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు బయల్దేరారు. కేసీఆర్‌తో రాజయ్య చర్చల అనంతరం.. వరంగల్ అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత టికెట్ నిరాకరించారు. దాంతో.. రాజయ్య కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ.. అధిష్టానం సంప్రదింపులు జరపడంతో ఆయన బీఆర్ఎస్‌లో కొనసాగారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తనని కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. దాంతో.. అధిష్టానం బుజ్జగింపులతో రాజయ్య.. కడియం గెలుపు కోసం పనిచేశారు. కానీ.. కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో పాటుగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. తాజాగా. పార్టీ కోసం పనిచేసి.. టికెట్ త్యాగం చేసిన రాజయ్యకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు బీఆర్ఎస్ రెడీ అయ్యినట్లు తెలుస్తోంది.