తెలంగాణలో త్వరలోనే ఉన్నస్థాయి టూరిజం కాన్‌క్లేవ్: మంత్రి జూపల్లి
త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By - Knakam Karthik |
హైదరాబాద్: పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని, పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యంగా త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) లో జరిగిన ట్రావెల్ & టూరిజం ఫెయిర్ (TTF) 2025 ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటీవల నూతన పర్యాటక విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. పర్యాటకం కేవలం వినోదం కాకుండా ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నది. వివిధ వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకు రావాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఇది విస్తృతమైన అవకాశాలను కల్పిస్తుంది. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టండి. వారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు..
ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, తెలంగాణలోనే త్వరలో ఒక ఉన్నత స్థాయి టూరిజం కాంక్లేవ్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం చర్చలకు, పెట్టుబడి ప్రణాళికలకు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తుందని వెల్లడించారు. ప్రపంచస్థాయి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వనరులు తెలంగాణలో ఉన్నాయని, అయితే తెలంగాణ పర్యాటకానికి అనుకున్న స్థాయిలోప్రచారం లభించడకపోవడమే అసలైన లోటన్నారు. మీరు మా రాష్ట్రాన్ని అన్వేషించేటప్పుడు, మా పర్యాటక అవకాశాలను ప్యాకేజ్ చేయటంలో భాగస్వాములు కావాలని, తెలంగాణకు బ్రాండ్ అంబాసడర్లుగా నిలవాలని టూరిజం, ట్రావెల్స్, హస్సిటాలిటీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతాయని, బతుకమ్మ వేడుకలను చారిత్రక వేయి స్తంబాల గుడి వద్ద ప్రారంభిస్తున్నామని, ఈ పూల పండుగను ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా ఆస్వాదించి, దాని వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి కోరారు.