Telangana: సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. కదం తొక్కిన నిరుద్యోగులు

హైదరాబాద్‌లో నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. నిరుద్యోగులు సచివాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

By అంజి  Published on  15 July 2024 8:13 AM GMT
Telangana, unemployed, secretariat, Hyderabad, Telangana Protests, Telangana DSC Protests

Telangana: సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. కదం తొక్కిన నిరుద్యోగులు

హైదరాబాద్‌లో నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. నిరుద్యోగులు సచివాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సచివాలయం ముట్టడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్‌కే భవన్‌ వైపు దూసుకెళ్లారు. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. డీఎస్సీ వాయిదా, గ్రూప్‌ - 2,3 పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

నిరుద్యోగులు తమ డిమాండ్లను సాధించుకునేందుకు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలను నెరవేర్చాల్సింది పోయి, అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్ల కోసం సెక్రటేరియేట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాం యాదవ్ సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటాన్ని కేటీఆర్ ఖండించారు.

'ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన 10 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలి. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి అమలు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌, మూడు నెలలు డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్‌ 2, 3 పరీక్షల వాయిదా, పోస్టుల సంఖ్య పెంపు తదితర హామీలను నెరవేర్చాలి' అని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అటు 'ఛలో సచివాలయం' కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఏఐఎస్ఎఫ్ నాయకులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన చేస్తున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) సభ్యులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Next Story