నేడు రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ సబ్ కమిటీ
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది.
By అంజి Published on 16 Sep 2024 4:38 AM GMTనేడు రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ సబ్ కమిటీ
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు జలసౌధలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రెండు కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జరగనున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కేబినెట్ సబ్ కమిటీ, ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు.
రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం గతంలో ఎమ్మెల్యేలకు, రాజకీయ పార్టీ సబ్ కమిటీ లేఖలు రాసింది. ఆ లేఖలకు ప్రతిస్పందనగా వచ్చిన సిఫారసులు, విధి విధానాలు అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు. అనంతరం 4 గంటల తరువాత తిరిగి జలసౌధలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు .. వర్గీకరణ అమలుకు సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుంది. ఈ సమావేశంలోలో కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొంటారు.