తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు.
By అంజి Published on 29 Jun 2023 9:19 AM IST
తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం సాయిచంద్ తన కుటుంబసభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి వచ్చారు. ఏమైందో ఏమో ఒక్క నిన్న అర్ధరాత్రి సాయిచంద్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని చికిత్స కోసం కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ గాయత్రి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సాయిచంద్ గుండెపోటు వల్లే మృతి చెందాడని గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వైద్యులు నిర్దారించారు.
1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్ జన్మించారు. సాయిచంద్ పీజీ వరకు చదువుకున్నాడు. విద్యార్థి దశ నుంచి కళాకారుడిగా, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆట పాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిచిలించారు. అలా తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. 2021 డిసెంబర్‌లో సాయిచంద్‌ను సీఎం కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణా ఉద్యమంలో, తెలంగాణా పునర్ నిర్మాణంలో సాయిచంద్ సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోతాయన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయి చంద్ పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.