తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే జయంతి నాటికి హైదరాబాద్ లో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్ పై సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.
సేవాలాల్ మహరాజ్ అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి సమీపంలోని సేవాగఢ్ లో 1739 ఫిబ్రవరి 15న జన్మించారు. ఆయన ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త కూడా. 18వ శతాబ్దంలో బంజారాలు బ్రిటీష్, ముస్లిం పాలకుల ప్రభావంతో ఇతర మతాల్లోకి మారకుండా సేవాలాల్ కీలక పాత్ర పోషించారు. బ్రహ్మచారి అయిన సేవాలాల్ తన బోధనలతో బంజారాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. అందుకే ఆయన జన్మదినాన్ని ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవుదినంగా ప్రకటించారు.