రోడ్డు ప్రమాదాల్లో 9వ స్థానంలో తెలంగాణ
Telangana stands 9th in road accidents in india. దేశంలో ప్రమాదాల రేటును తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివిధ చర్యలు తీసుకుంటోంది.
By అంజి
దేశంలో ప్రమాదాల రేటును తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివిధ చర్యలు తీసుకుంటోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రాజ్యసభలో అందించిన సమాచారం ప్రకారం.. 2017 నుంచి 2020 మధ్య దేశంలో సుమారు 17 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. తెలంగాణలో సుమారు 85,000 ప్రమాదాలు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 9వ స్థానంలో నిలిచింది. .
రోడ్డు ఇంజినీరింగ్, వెహికల్ ఇంజినీరింగ్ లోపాలు, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పౌరుల్లో ట్రాఫిక్ సెన్స్‌ను పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఏకకాలంలో ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తోంది. "సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా రోడ్డు భద్రతపై వివిధ ప్రచార చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్‌లో రోడ్ సేఫ్టీ ఆడిటర్ల కోసం సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించబడింది." అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
రోడ్డు ఇంజినీరింగ్‌కు సంబంధించి.. ప్రణాళిక దశలోనే రోడ్డు భద్రతను రోడ్డు డిజైన్‌లో అంతర్భాగంగా మార్చామని చెప్పారు. ''అన్ని హైవే ప్రాజెక్ట్‌ల రోడ్ సేఫ్టీ ఆడిట్ అన్ని దశలలో తప్పనిసరి చేయబడింది. డిజైన్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ, బ్లాక్ స్పాట్‌ల గుర్తింపు, సరిదిద్దడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.'' అని గడ్కరీ అన్నారు.
వాహన ఇంజనీరింగ్ లోపాలపై, సీటు బెల్ట్ రిమైండర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కోసం మాన్యువల్ ఓవర్‌రైడ్, ఓవర్ స్పీడింగ్ వార్నింగ్ సిస్టమ్ వంటి భద్రతా సాంకేతికతలను వాహనాలలో తప్పనిసరిగా అమర్చాలని మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని ఆయన చెప్పారు. ''వాహనం ముందు సీటుపై, డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకుడికి ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి. ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి, ఎమ్1 కేటగిరీ వాహనంలో రెండు వైపులా టోర్సో ఎయిర్ బ్యాగ్‌లు, రెండు వైపులా కర్టెన్/ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చబడతాయి.'' అని ఆయన చెప్పారు.
ట్రాఫిక్ నిబంధనల అమలు కోసం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తోంది. టోల్ ప్లాజాల వద్ద పారామెడికల్ సిబ్బంది/ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నర్సుతో అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ రహదారుల అథారిటీ అత్యవసర సంరక్షణను ఏర్పాటు చేసింది.