Telangana: మహిళపై అత్యాచార యత్నం.. జైనూర్‌లో చెలరేగిన హింస.. దుకాణాలు, ఇళ్లు దగ్ధం
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై అత్యాచారయత్నానికి వ్యతిరేకంగా ఒక వర్గం బుధవారం నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 5 Sept 2024 9:00 AM ISTTelangana: మహిళపై అత్యాచార యత్నం.. జైనూర్‌లో చెలరేగిన హింస.. దుకాణాలు, ఇళ్లు దగ్ధం
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై అత్యాచారయత్నానికి వ్యతిరేకంగా ఒక వర్గం బుధవారం నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. జైనూర్ పట్టణం నుండి వచ్చిన దృశ్యాలలో ఆకస్మికంగా బూడిద పొగలు కమ్ముకున్నాయి. గుంపు దుకాణాలు,ఇళ్లను తగలబెట్టింది. మండల కేంద్రంలో ఆగ్రహించిన ఆదివాసీలు కొన్ని దుకాణాలు, వాహనాలను తగులబెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
దీనికి ప్రతీకారంగా జైనూర్ పట్టణంలో ఓబీసీలు, అగ్రవర్ణ హిందువులకు చెందిన కొన్ని దుకాణాలను ఇతర వర్గీయులు తగులబెట్టారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఓ మసీదుపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. బుధవారం, 45 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం, హత్యకు ప్రయత్నించిన ఆరోపణలపై పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31న రోడ్డు పక్కన పడి ఉన్న మహిళ కనిపించింది. తొలుత ఈ ఘటనను హిట్ అండ్ రన్ కేసుగా గుర్తించారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అయితే సెప్టెంబర్ 1న మహిళ తమ్ముడు ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోండు సామాజికవర్గానికి చెందిన మహిళ సెప్టెంబర్ 2న స్పృహలోకి వచ్చి తనకు జరిగిన బాధను పోలీసులకు వివరించింది.
ఉద్యోగం కోసం వెళ్లిన ఆమె.. జైనూర్ నుంచి తన తల్లి గ్రామానికి కాలినడకన వెళ్తున్నట్టు మహిళ చెప్పింది. ఆమె జైనూర్ నుండి షేక్ ముగ్ధం నడుపుతున్న ఆటో ఎక్కింది. మార్గమధ్యంలో డ్రైవర్ తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని మహిళ పేర్కొంది. ఆమె ప్రతిఘటించి సహాయం కోసం కేకలు వేయడంతో కర్రతో దాడి చేశాడు. ఆమె చనిపోయిందని నమ్మి, రోడ్డు ప్రమాదంగా భావించి రోడ్డుపై వదిలేశాడు.
మహిళ వాంగ్మూలాన్ని అనుసరించి, పోలీసులు నిందితులపై అత్యాచారయత్నం, హత్యాయత్నం వంటి అభియోగాలతో సహా ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణను పర్యవేక్షిస్తున్న డీఎస్పీ సదయ్య పంథాటి నిందితుడిని ఆసిఫాబాద్‌కు తీసుకువచ్చినట్లు పేర్కొంటూ అరెస్ట్‌ను ధ్రువీకరించారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మత ఉద్రిక్తతలపై తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"నేను శాంతి కోసం విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసకు పాల్పడుతున్న వారిని వెంటనే పట్టుకోవాలి. చట్టబద్ధమైన పాలన ఉండాలి'' అని ఒవైసీ అన్నారు. జైనూర్‌లో మత కలహాల ఘటనలపై తెలంగాణ డీజీపీతో మాట్లాడినట్లు ఒవైసీ ట్వీట్ చేశారు. "ఇది మానిటర్ చేయబడిందని, అదనపు బలగాలను పంపుతున్నామని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ డిజిపి నాకు హామీ ఇచ్చారు" అని ఆయన చెప్పారు.