హైదరాబాద్: గత నెల 26న ప్రారంభించిన నాలుగు పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చి 31 లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో మొత్తంగా 12,845 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 563 గ్రామాల్లో ఈ గత నెల 26వ తేదీన నాలుగు పథకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం 600 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో ఈ పథకాలు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు అధికారులు. లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను ఫైనల్ చేసుకున్నాకే ఆయా గ్రామాలకు షెడ్యూల్ ఇవ్వనున్నారు. ప్రతి గ్రామంలో నాలుగు పథకాలు అమలు చేయాల్సి ఉంది. దీంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది.