తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేవలం మూడు రోజుల్లోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1, 2, 3 తేదీల్లో ఈ నిధుల పంపిణీ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిర్ణయంతో పెద్ద ఉపశమనం లభించనుంది. పారదర్శకంగా, వేగంగా నిధులు చేరేలా సాంకేతిక పరమైన చర్యలు కూడా తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు, సుమారు 1.46 కోట్ల ఎకరాలకు ఎకరానికి రూ. 6,000 చొప్పున ఈ పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 9,000 కోట్లను సమీకరించింది. ఈనెల 23న జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న వెంటనే నిధుల పంపిణీ ప్రారంభం కానుంది.