హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో మహిళలకు అందించిన 'సహేలీ' తరహా కార్డులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ కార్డులపై లబ్ధిదారుల ఫొటోతో కూడిన వివరాలు ఉంటాయి.
ఈ కార్డులు వస్తే ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం తప్పనుంది. వచ్చే సంవత్సరం నుండి ఈ కార్డులను హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రాయితీలపై ప్రయాణం చేసే వారికి సైతం స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. మహాలక్ష్మీ పథకం ప్రారంభమై ఇటీవలే రెండేళ్లు పూర్తైంది.
ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలకు 8459 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం పొందారు. ఇది మహిళా సాధికారతకు మైలురాయిగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని స్మార్ట్ కార్డు విధానంపై అధికారులు ఇప్పటికే స్టడీ చేశారు. 2025లోనే స్మార్ట్ కార్డు ప్రవేశపెట్టాల్సి ఉంది.. అయితే పలు టెక్నికల్ ఇష్యూస్ వల్ల జాప్యం జరిగింది. దీంతో వచ్చే ఏడాది నుంచి స్మార్ట్ కార్డు విధానం అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.