తెలంగాణ వ్యాప్తంగా రెండు గంటలపాటు సాగిన ఆర్టీసీ కార్మికుల నిరసన
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఉదయం రెండు గంటల పాటు నిరసన తెలిపారు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 9:25 AM ISTతెలంగాణ వ్యాప్తంగా రెండు గంటలపాటు సాగిన ఆర్టీసీ కార్మికుల నిరసన
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఉదయం రెండు గంటల పాటు నిరసన తెలిపారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపుతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆర్టీసీ కార్మికులకు విధులకు దూరంగా ఉన్నారు. ఇక 8 గంటల తర్వాత కార్మికులు మళ్లీ విధుల్లో పాల్గొన్నారు. రెండు గంటల పాటు నిలిచిపోయిన బస్సులు.. మళ్లీ యథాతధంగా నడుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మాత్రం బస్సులు ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో.. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. దానికి సంబంధించిన బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన బిల్లును రూపొందించి.. సాంకేతికపరంగా ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ తమిళిసైకి పంపించింది. అయితే.. బిల్లును పంపించి ఇప్పటికే రెండ్రోజులు గడుస్తున్నా గవర్నర్ తమిళిసై మాత్రం బిల్లుకు ఇంకా ఆమోదం తెలపలేదు. దాంతో.. గవర్నర్ తమిళిసై తీరుని ఆర్టీసీ కార్మికులు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే బిల్లుకు ఆమోదం తెలపాలంటూ నిరసన చేపట్టారు. ఉదయం రెండు గంటల పాటు బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 6 గంటల నుంచి 8 గంటల వరకు నిరసన ముగిసింది. తర్వాత బస్సులు యథాతధంగా కొనసాగుతున్నాయి.
ఉదయం స్కూళ్లు, కాలేజ్‌లు, ఆఫీసులకు వెళ్లే వారికి మాత్రం ఇక్కట్లు తప్పలేదు. సమయానికి చేరుకునేందుకు వారు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇంకా నిరసన విషయం తెలియని వారు పలుచోట్ల బస్టాపుల్లో బస్సుల రాకకోసం వేచి చూశారు. దాంతో బస్టాప్‌లు కూడా రద్దీగా మారాయి. రాజ్‌సభవన్ వద్ద కూడా నిరసన చేపట్టాలని టీఎంయూ నిర్ణయించింది. ఈ మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని కార్మికులు ఈ ధర్నాలో పాల్గొనాలని కోరింది. దాంతో.. నగర వాసులకు ఇంకొన్ని గంటల పాటు బస్సులు అందుబాటులో ఉండే అవకాశం లేనట్లు అర్థం అవుతోంది.
హైదరాబాద్‌లో ఉప్పల్, చెంగిచర్ల, హయత్‌నగర్, షాద్‌నగర్, ఫలక్‌నుమా, ఫరూక్ నగర్, హకీంపేట, లింగపల్లి హెచ్‌సీయూ, కూకట్‌పల్లి తదితర డిపోల్లో కార్మికులు నిరసన చేపట్టారు. గవర్నర్ ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బిల్లుకు ఆమోదం తెలిపే వరకు పోరాడతామని.. నిరసనలు తెలుపుతామని చెబుతున్నారు. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి కొంత కాలంగా పడటం లేదు. ఏ కార్యక్రమానికి గవర్నర్‌ను ప్రభుత్వం ఆహ్వానించడం లేదు. దూరంగానే ఉంచుతోంది. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై బిల్లుకు ఆమోదం తెలపడంలో ఆలస్యం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.