హైదరాబాద్‌లో రేపే గ్లోబల్ సమ్మిట్..27 అంశాలపై చర్చలు
రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది.
By - Knakam Karthik |
హైదరాబాద్‌లో రేపే గ్లోబల్ సమ్మిట్..27 అంశాలపై చర్చలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు తరలివస్తున్నారు.
తొలిరోజు సోమవారం మధ్నాహ్నం 1.30 గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. సదస్సులో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి , బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా తో పాటు ఇతరులు ప్రసంగించనున్నారు.
మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు.
రెండు రోజుల సదస్సులో మొత్తం 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. అందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్దం చేశారు. సదస్సు నిర్వహిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణమంతా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. సదస్సులో పాల్గొనే ప్రతినిధులను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో ప్రత్యేక సంగీత కచేరితో అలరించనున్నారు.
అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం సందర్శించేలా పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అతిధులను తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని అందించనున్నారు.