తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి..
By - అంజి |
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8 వ తేదీన రెండో వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని వచ్చే డిసెంబర్ 9 వ తేదీన ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రోడ్ మ్యాప్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 నిర్వహణ తదితర అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రూపొందించే పాలసీ ఆధారంగానే భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని, విధానపరమైన ప్రణాళిక ఉంటే పెట్టుబడిదారులకు ఒక స్పష్టత వస్తుందని చెప్పారు.
పాలసీ డాక్యుమెంట్ ప్రభుత్వంలోని శాఖల వారిగా ఉండాలని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 లో ఆయా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా శాఖల వారిగా పాలసీ డాక్యుమెంట్ సిద్ధం కావాలని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, సంబంధిత ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ఉప ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తారని, సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని, అలాగే అందుకు తగిన విధంగా భద్రత విషయంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.