తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయనకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు సాదాబైనామా, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు అలాగే ఖరీఫ్‌లో మిగిలిపోయిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్లా ఖాన్ తో మంత్రి పొంగులేటి ఫోన్ చేసి ఖరీఫ్‌లో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో పుణ్యపురం గ్రామానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు పెండింగ్లో ఉన్న సాదాబైనామా గురించి ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు. వెంటనే మంత్రి స్పందించి సాదాబైనామా పరిష్కారానికి కేవలం ఒక్క నెల గడువు మాత్రమే ఇస్తామని అది కూడా ఈనెల 15న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని, ఎన్నికల ప్రక్రియ ముగిశాక భూభారతిలో ఒక నెలలో సాదాబైనామాల పరిష్కారానికి అవకాశం ఇస్తామని, ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
కాగా హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చింది. ఎన్నికలకు సన్నద్ధమంటూ పంచాయతీ రాజ్, ఎన్నికల సంఘం అధికారులు చెప్పినట్లు సమాచారం. కాగా కులగణన నివేదిక కూడా కేబినెట్ సబ్ కమిటీకి అందింది. దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించాక.. ఈ నెల 5న జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.