ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. భానుడి నుంచి రక్షించుకునేందుకు విద్యుత్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. మంగళవారం మధ్యాహ్నాం రికార్డు స్థాయిలో 14,117 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని విద్యుత్ శాఖ తెలిపింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు కావడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. మరో నాలుగైదు రోజుల వరకు విద్యుత్ వినియోగం ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందని బావిస్తున్నారు.
డిమాండ్ పెరిగినా.. విద్యుత్ కోతల భయం అక్కర్లేదని 18 వేల మెగావాట్ల డిమాండ్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ట్రాన్స్ కో-జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. కాగా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.20కి కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దక్షిణ భారత దేశంలో అత్యధిక విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా.. తమిళనాడు తొలి స్థానంలో ఉంది.