అలర్ట్: గ్రూప్-2 రిజల్ట్స్ రిలీజ్ చేసిన TGPSC, ర్యాంకింగ్స్ లిస్ట్‌తో పాటు ఫైనల్ కీ విడుదల
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.
By Knakam Karthik Published on 11 March 2025 4:18 PM IST
అలర్ట్: గ్రూప్-2 రిజల్ట్స్ రిలీజ్ చేసిన TGPSC, ర్యాంకింగ్స్ లిస్ట్‌తో పాటు ఫైనల్ కీ విడుదల
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. గత సంవత్సరం నిర్వహించిన ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ తో పాటు ఫైనల్ కీ ని కూడా బయట పెట్టారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఓఎంఆర్ షీట్స్‌ను టీజీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ పరీక్ష కోసం 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 15, 16 తేదీలలో ఎగ్జామ్ నిర్వహించగా.. ఈ పరీక్షకు 2.49 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
ఇందులో 2.36 లక్షల మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలల్లో టాపర్ కు అత్యధికంగా 447 మార్కులు వచ్చాయి. కాగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం గ్రూప్-1 ఫలితాలను విడుదల చేయగా.. ఇవాళ గ్రూప్-2 ఫలితాల జాబితాను వెబ్ సైట్ లో పెట్టారు. దీంతో పాటు ఈ నెల 14న గ్రూప్-3 ఫలితాలను, ఈ నెల 20 న హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలను కూడా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే లక్ష్యంతో నోటిఫికేషన్లు విడుదల చేసి, వెను వెంటనే పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం ఆర్థిక శాఖ ఆమోదం పొందిన మరికొన్ని ఉద్యో్గాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. రాబోయే నోటిఫికేషన్లకు సిద్దంగా ఉండాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సహా పలు బోర్డులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.