తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు రాష్ట్రంలో పర్యటించారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో ఎన్నికలు జరగనున్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శుక్రవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీధి కార్నర్ సమావేశాలు, రోడ్ షోలలో ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయన హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి, హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు పినపాక చేరుకుంటారు.
అక్కడ రోడ్డు కార్నర్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని వర్గాలు గురువారం తెలిపాయి. పినపాక నుంచి నర్సంపేటకు చేరుకుని అక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఆయన పాద యాత్ర చేపట్టనున్నారు. అనంతరం వయనాడ్ ఎంపీ రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకుని రాజేంద్రనగర్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారని, అక్కడి నుంచి తిరిగి దేశ రాజధానికి చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.