నర్సాపూర్‌: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోరు.. ప్రజల ఓట్లు ఎవరికి?

నర్సాపూర్‌లోని ఏడు మండలాల్లో మౌలిక వసతుల లేమి ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2023 7:00 AM GMT
Telangana Polls, Narsapur, BRS, Congress

నర్సాపూర్‌: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోరు 

ఆలస్యమైన పింఛన్‌, పంట రుణాల మాఫీ హామీని అమలు చేయకపోవడం.. నర్సాపూర్‌లోని ఏడు మండలాల్లో మౌలిక వసతుల లేమి ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు సమీపంలో ఉన్న ఈ తాలూకాలోని ఏడు మండలాలు నిత్యం జంతు సంచారం కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. పట్టణంలో ఎక్కడ చూసినా కోతులు దర్శనమిస్తున్నాయి. కోతుల బెడద శాశ్వతమని.. ఏ నాయకుడూ దాన్ని పరిష్కరించలేడని కూడా ప్రజలు ఫిక్స్ అయ్యారు. వారికి కావలసిందల్లా మౌలిక సదుపాయాలు, వ్యవసాయం చేసుకోడానికి అనువైన చర్యలు.

మండలాల్లో మౌలిక సదుపాయాలు:

ప్రధాన రహదారుల్లో రోడ్లు నిర్మించారు కానీ.. గ్రామాలను కలుపుతూ అంతర్గత రోడ్లు మాత్రం ఏ మాత్రం లేవు. మండలాల్లో ఉన్న చిన్న గ్రామాలకు రోడ్లు ఇంకా వేయలేదు.. వేయాల్సి ఉంది. గిరిజన మహిళ సతమ్మ మాట్లాడుతూ.. ‘‘పింఛన్‌ కోసం మా గ్రామం నుంచి నర్సాపూర్‌ తాలూకాకు రెండు గంటలపాటు కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఈసారి సగం డబ్బులు మాత్రమే ఇచ్చారు. కాబట్టి, నేను రెండుసార్లు వెళ్లి రావాలి." అని తెలిపింది. గ్రామాల్లో కాంక్రీట్‌, బ్లాక్‌టాప్‌ రోడ్లు లేవు. గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు మట్టిరోడ్లను ఉపయోగిస్తున్నారు. వర్షాకాలంలో రోడ్లు దెబ్బతిని ప్రయాణానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. గ్రామస్తులు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, టెంపోలు, ట్రాక్టర్లలో ప్రయాణిస్తుంటారు.

పంట రుణమాఫీ:

రైతులకు ఉన్న అతి పెద్ద సమస్య 'పంట రుణాల మాఫీ'. ఇందుకోసం వారు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తూ ఉన్నారు. వాగ్దానాలు నెరవేరలేదు. రైతు, కేబుల్ ఆపరేటర్ అయిన నారా గౌడ్ మాట్లాడుతూ.. “మాకు BRS ప్రభుత్వం రెండుసార్లు పంట రుణమాఫీ హామీ చేస్తామని చెప్పింది. మేము ఒక్కసారి మాత్రమే అందుకున్నాము. రెండో విడత సొమ్మును ప్రభుత్వం ఇంతవరకు తిరిగి చెల్లించలేదు. అది నెరవేరుతుందని అంటున్నారు.. కానీ ఎప్పుడు? ” అని ప్రశ్నించారు.

ప్రభుత్వ హామీ మేరకు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి రుణ మాఫీ డబ్బులకు రెట్టింపు వడ్డీలు చెల్లిస్తున్నామని రైతులు చెబుతున్నారు. డబ్బులు రాకపోవడంతో ఎక్కువ డబ్బులు వడ్డీకి చెల్లిస్తున్నారు. ఈ అంశాలు ఈ ఎన్నికల సీజన్‌లో ఇతర పార్టీల వాగ్దానాల వైపు చూసేలా చేస్తున్నాయి. BRS కరెంటు, నీరు ఇచ్చినప్పటికీ "అచా తో కియా హై, లేకీన్ అభి చేంజ్ చైయే" అని ఒక రైతు అంటున్నాడు.

నిధుల కోసం ఎదురు చూస్తున్న సర్పంచ్‌లు:

అన్ని మండలాల్లోనూ సర్పంచ్‌లు గ్రామాల్లో డ్రైనేజీ పనులు, కుచ్చా రోడ్ల మరమ్మతులు, ఇతర పనులు చేపట్టారు. అయితే వారికి ఇంకా డబ్బులు అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బు చాలా ఎక్కువగా ఉందని, చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పారు. “కేంద్ర ప్రభుత్వం డబ్బు విడుదల చేయడం లేదు.. దాని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మా డబ్బు విడుదల చేయడం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది, అభివృద్ధి కోసమే ఇక్కడికి వచ్చామని ప్రజలకు చెబుతున్నాం’’ అని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలను ఆయన బుజ్జగిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోరు:

నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ద్విముఖ పోరు మాత్రమే కనిపిస్తోంది. 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సునీత లక్ష్మా రెడ్డిని బీఆర్‌ఎస్ రంగంలోకి దింపింది. సునీతారెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాసిపేట మండలం నర్సాపూర్‌కు చెందిన రాజిరెడ్డిని కాంగ్రెస్‌ తరపున పోటీకి దింపారు. వీరిద్దరూ ఈ ప్రాంతానికి చెందిన వారు కాగా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారని, మరో ఐదేళ్లు ఆగాల్సిన అవసరం లేదని ప్రజలు ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇ.మురళీ యాదవ్‌ను రంగంలోకి దింపింది.. అయితే ఆయనకు గతంలో లాగా కొన్ని ఓట్లు మాత్రమే పడతాయని ప్రజలు అంటున్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ కు అత్యధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కౌడిపల్లె, కుల్చారం, నర్సాపూర్ (సెమీ-అర్బన్), హత్నూర, యెల్దుర్తి, శివ్వంపేట మండలాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. వెనుకబడిన తరగతులు, రెడ్డి వర్గాల అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఈ అసెంబ్లీలో మూడు దశాబ్దాలుగా చౌటి జగన్నాథరావు (INC), చిలుమల విఠల్ రెడ్డి (CPI) మధ్య పోటీ ఉంది. 1978,1985, 1989, 1994లో విఠల్ రెడ్డి గెలుపొందగా, 1983లో జగన్నాథం గెలుపొందారు. 1999లో వి.సునీత లక్ష్మా రెడ్డి (INC) విఠల్ రెడ్డి నుంచి సీటు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా జరిగిన ఎన్నికల్లో ఆమె నాలుగుసార్లు గెలిచారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

వాకిటి సునీత లక్ష్మా రెడ్డి (BRS)

ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పెన్షన్లు, ఇందిరా క్రాంతి యోజన పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు. 2014లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఆమె 2019లో BRSలో చేరారు.

ఆవుల రాజి రెడ్డి (INC)

బీఆర్‌ఎస్ తన అభ్యర్థిని ప్రతిపాదించడంలో జాప్యం చేయడంతో కాంగ్రెస్‌కు చెందిన ఆవుల రాజి రెడ్డి ముందస్తు ప్రచారాన్ని ప్రారంభించారు. మదన్‌రెడ్డి తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అసెంబ్లీ నియోజకవర్గంలోని మెజారిటీ మండలాల్లో ఆయనకు పరీక్ష ఎదురుకానుంది.

ఎర్రగొల్ల మురళీ యాదవ్ (బీజేపీ)

2018 ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే రావడంతో నర్సాపూర్‌లో గట్టిపోటీని ఇవ్వాలనే కసితో బీజేపీ నేత ఉన్నారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న మురళీ యాదవ్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గతేడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.

Next Story