Telangana Polls: కేసీఆర్ సహా బీఆర్‌ఎస్ కీలక నేతలు నామినేషన్ల దాఖలు
గజ్వేల్ నుంచి మూడో సారి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల అధికారికి సమర్పించారు.
By అంజి Published on 9 Nov 2023 12:44 PM ISTTelangana Polls: కేసీఆర్ సహా బీఆర్‌ఎస్ కీలక నేతలు నామినేషన్ల దాఖలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళవుతోంది. ముచ్చటగా మూడో సారి గెలుపొందేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఊవ్విళ్లూరుతోంది. తాజాగా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడో సారి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు వెళ్లిన కేసీఆర్.. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డికి బయల్దేరారు. అక్కడ నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి హరీశ్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణంలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్వో కార్యాలయానికి బయల్దేరారు.
ఇటు సూర్యాపేట బీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. 2018లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన మంత్రి.. పట్టణంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈకార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
వనపర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి ఎండ్ల బండిపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వనపర్తిలోని తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన నిరంజన్ రెడ్డి వనపర్తి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు.