Telangana: శభాష్ పోలీస్‌.. రోడ్డు ఊడ్చి ట్రాఫిక్ క్లియర్ (వీడియో)

పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు శభాష్ పోలీసు అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2024 7:15 AM GMT
telangana, police, sweep, road, viral video,

 Telangana: శభాష్ పోలీస్‌.. రోడ్డు ఊడ్చి ట్రాఫిక్ క్లియర్ (వీడియో)

ఖాకీ యూనిఫాంలో కర్కషత్వమే కాదు ఆపద వస్తే ఆదుకునే మనస్తత్వం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలు గతంలోనే చాలా చూశాం. కొందరు పోలీసులు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్రెండ్లీ పోలీస్‌గా ఉంటూనే రౌడీలు, పోకిరిలు పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు విధులు కష్టతరమైనవి. ఎండ, వాన ఇలాంటివేవీ పట్టించుకోకుండా రోడ్లపై డ్యూటీ చేస్తారు. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక వర్షాకాలం వస్తే కొన్నిచోట్ల మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయి లేదా రోడ్లు గుంతలు పడి ఉంటాయి. అలాంటప్పుడు ఈ ట్రాఫిక్ పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు శభాష్ పోలీసు అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చౌటుప్పల్ వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రెండు లారీలు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ.. ఆ రెండు లారీలలో ఉన్న బీర్ల సీసాలు, ఉల్లిగడ్డలు ఎగిరి వచ్చి రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఆ ఘటన స్థలాన్ని దాటి వాహనాలు ముందుకు కదల్లేదు. భారీగా ట్రాఫిక్ జామైంది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డును శుభ్రం చేసి వేగంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇదంతా అక్కడ ఉన్న వాహనదారులు చూస్తూ ఉండిపోయారు. పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వాహనదారులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Next Story