జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు
Telangana police rejects permission for JP Nadda's rally in Hyderabad. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు
By Medi Samrat Published on 4 Jan 2022 4:10 PM ISTభారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు జేపీ నడ్డా నగరానికి రానున్నారు. రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలతో ఎలాంటి ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదని.. అందుకే కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసులు మోహరించారు. జేపీ నడ్డాను విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది.
దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావును తూఫ్రాన్ టోల్‌గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి అనుమతి లేనందున బీజేపీ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రఘునందన్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మంగళవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసులపై కార్యకర్తలతో దాడి చేయించారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో బండి సంజయ్‌కు కరీంనగర్ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను జిల్లా జైలుకు తలించారు. బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు.