రీపోస్ట్ ఎఫెక్ట్.. ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik
రీపోస్ట్ ఎఫెక్ట్.. ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న "హాయ్ హైదరాబాద్" అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మిత రీపోస్ట్ చేశారు. అందులో హెచ్‌సీయూ మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లు ఉంది. అలాగే వాటి ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్టుని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫొటోగా తేల్చారు. ఈ మేరకు BNS 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు. ఇప్పటికే కంచ గచ్చిభూముల వ్యవహారంలో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్న పోలీసులు.. తాజాగా స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ చేసిన రీ పోస్టు ఆమె నోటీసులకు కారణం అయింది.