ఫామ్ హౌస్‌లో కోడిపందేలు నిర్వహించారనే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీకి చెందిన 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాం హౌస్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన వ్యాపారి భూపతిరాజ్ శివకుమార్ కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఫామ్ హౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా ఇదే తంతు నడుస్తోన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
కాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఓ ఫామ్ హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. కోడి పందేలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. తనిఖీల అనంతరం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. అలాగే 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.