వర్షంలో కిషన్‌రెడ్డి నిరసన..అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఉద్రిక్తత
హైదరాబాద్‌లో బీజేపీ నేతల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 July 2023 7:56 AM GMTవర్షంలో కిషన్‌రెడ్డి నిరసన..అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఉద్రిక్తత
హైదరాబాద్‌లో బీజేపీ నేతల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. నగర శివారులోని బాటసింగారంలో డబుల్‌బెడ్రూం ఇళ్లను పరిశీలించడానికి వెళ్లేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉదయం నుంచే హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ముఖ్య నేతలందరినీ గృహనిర్బంధం చేశారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద కిషన్‌రెడ్డిని కూడా అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే కిషన్‌రెడ్డిని అడ్డుకోవడంతో వర్షంలోనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ప్రభుత్వం కట్టించిన డబుల్‌బెడ్రూం ఇళ్లను పరీశీలిచేందుకు ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి వెళ్లాలని ప్రయత్నం చేశారు. దాంతో.. కార్లలో ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరారు. కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ని తమ వాహనాలను అడ్డుపెట్టి అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుని వ్యతిరేకిస్తూ కిషన్‌రెడ్డి వర్షంలోనే కారు దగ్గర బైఠాయించారు. కేంద్రమంత్రిని అయిన తనను ఎలా అడ్డుకుంటారని సీపీ చౌహాన్‌తో వాగ్వాదానికి దిగారు. రఘునందన్, ఇతర నేతలతో కలిసి వర్షంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా తనకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. బాటసింగారం వెళ్లి తీరుతానని చెప్పారు. కార్యకర్తలంతా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేయాలనే ఉద్దేశంతో పోలీసులు కిషన్‌రెడ్డితో పాటు, రఘునందన్‌రావుని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు తరలించకుండా పోలీసులు రోడ్లపైనే తిప్పుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పోలీసులు కిషన్‌రెడ్డిని ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పకుండా 20 పోలీసు వాహనాలతో తిప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.