తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 10 బిల్లులు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తన వద్ద పెండింగ్ లో పెట్టుకోవడంపై సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో లిస్ట్ కాలేదు. రేపటి నుండి సుప్రీంకోర్టుకు హోళీ పండుగ సెలవులు. దీంతో హోళీ పండుగ సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించే అవకాశం ఉంది.
ఇక సోషల్ మీడియా వేదికగా గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంపై పరోక్షంగా విమర్శలు చేశారు. "సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌ను రావడానికి సమయం లేదా..? అధికారికంగా రాలేదు. ప్రోటోకాల్ లేదు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్ కలవలేదు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయి." అని గవర్నర్ ట్వీట్ చేశారు.