ఆ ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించండి..ప్రధానికి మంత్రి తుమ్మల లేఖ
చేనేత ఉత్పత్తులపై 5% GSTను మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హస్తకళల మరియు చేనేతశాఖ మంత్రివర్యులు గిరిరాజ్ సింగ్ కి లేఖల ద్వారా విన్నవించారు
By Knakam Karthik
ఆ ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించండి..ప్రధానికి మంత్రి తుమ్మల లేఖ
చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి, వారి నిరంతరం ఉపాధి కల్పించడానికి మరియు భారతీయ చేనేతకళా వారసత్వాన్ని భావితరాలకు అందించడానికి చేనేత ఉత్పత్తులపై 5% GSTను మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హస్తకళల మరియు చేనేతశాఖ మంత్రివర్యులు గిరిరాజ్ సింగ్ కి లేఖల ద్వారా విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర హస్తకళల పరిశ్రమకు ఊపిరిలాంటి చేనేత రంగం, చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన 5 శాతం జిఎస్టీ వలన ప్రస్తుతం చేనేత రంగం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పించే ఈ రంగం, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులకు జీవనాధారం అవుతున్నదన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ కాటన్ మరియు పట్టు చీరలు, నారాయణపేట కాటన్ మరియు పట్టు చీరలు, సిద్దిపేట గొల్ల భామ చీరలు, వరంగల్ దర్రీస్, Karimnagar డబుల్ క్లాత్ చెద్దర్లు, ఇతర చేనేత వస్త్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, వీటిలో ఆరు ఉత్పత్తులు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద నమోదు అయ్యాయని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 23,046 మంది చేనేత కార్మికులు, 34,569 మంది అనుబంధ కార్మికులు ఈ రంగంలో పని చేస్తున్నారని చెప్పారు. ముడి సరుకుల ధరలు పెరగడం, పవర్‌లూమ్ & మిల్ రంగాలు తక్కువ ఉత్పత్తి వ్యయంతో వస్త్రాలు తయారుచేయడంతో, మార్కెట్లో చేనేత వస్త్రాలు తయారుచేసే నేత కార్మికులకు గిరాకి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు 5% GST విధించడం వల్ల చేనేత ఉత్పత్తుల ధరలు పెరిగి వినియోగం తగ్గిపోతుందని, కార్మికుల జీవనాధారం సంక్షోభంలో పడుతోందని ఆయన తెలిపారు.
GST కారణంగా నష్టపోతున్న నేతన్నలు తమ సంప్రదాయ వృత్తిని వదిలి వలస వెళ్ళాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఖాదీ రంగం మరియు చేనేత రంగం రెండూ సహజసిద్ధమైన గ్రామీణ పరిశ్రమలుగా ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఖాదీ ఉత్పత్తులపై GST మినహాయింపు ఉండగా, చేనేత ఉత్పత్తులపై 5% GST కొనసాగించడం అన్యాయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు మరియు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు కార్మికులు ఈ పన్నును వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయని ఆయన తెలిపారు.