'ఆవో-దేఖో-సీకో'.. ప్ర‌ధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ‌

Telangana minister KTR writes open letter to PM Modi.ఆవో-దేఖో-సీకో (రండి-చూడండి-నేర్చుకొండి)అంటూ ప్రధానమంత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2022 4:10 AM GMT
ఆవో-దేఖో-సీకో.. ప్ర‌ధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ‌

ఆవో-దేఖో-సీకో (రండి-చూడండి-నేర్చుకొండి)అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని కోరారు. పార్టీ డి.ఎన్.ఏ లోనే విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అని తెలుసు, అయినా వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసున‌ని ఆ లేఖలో మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇంకా లేఖలో మంత్రి కేటీఆర్​ ఏం అన్నారంటే..?

''అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు. అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభం చేయడానికి తెలంగాణకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదు. తెలంగాణ ప్రాజెక్టులు-పథకాలు-సుపరిపాలన విధానాలు ప్రాధాన్యతలను అధ్యయనం చేయండి. డబుల్ ఇంజిన్ తో ప్రజలకు ట్రబుల్ గా మారిన మీ రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ప్రయత్నించండి. అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండి. మత సామరస్యంతో కూడిన వసుదైక కుటుంబం లాంటి సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి- కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి

హైదరాబాద్‌కు వస్తున్న బీజేపీ నాయకులకు మతాలు, ప్రాంతాల పేరిట సంకుచిత మనస్తత్వం లేని శాంతియుత తెలంగాణ తరపున స్వాగతం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా మారి అద్భుతమైన అభివృద్దితో ప్రపంచపటంపై తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటున్న హైదరాబాద్ లో మీ పార్టీ సమావేశం పెట్టుకోవడం నాకైతే ఆశ్చర్యం ఏమీ అనిపించడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ లు కొలువైన మీ రాష్ట్రాల్లో ఇప్పటికీ నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులే మిమ్మల్ని తెలంగాణకు రప్పించి ఉంటాయని నేను భావిస్తున్నాను. కారణాలు ఏవైనా మీ పార్టీ నాయకత్వం మొత్తం హైదరాబాద్ లో మకాం పెడుతున్న ఈ సందర్భంలోనైనా కాసింత తెలంగాణతనాన్ని నేర్చుకోవాలని, ఇక్కడి గాలి గానం చేసే గంగా జమునా తెహజీబ్ ను గుండెల నిండా నింపుకోండని సలహా ఇస్తున్నాను.

కులం, మతం, జాతి ఆధారంగా సమాజాన్ని ఖండ ఖండాలుగా విడదీసే మీ దుర్మార్గ రాజకీయాల చుట్టూనే మీ చర్చలు సాగుతాయనడంలో నాకెలాంటి అనుమానం లేదు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల అసలు అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసు . ఇరిగేషన్- ఇన్ఫ్రాస్ట్రక్చర్-ఇన్నోవేషన్- ఇంక్లూజివ్ నెస్ వంటి వినూత్నమైన విధానాలతో, సమ్మిళిత అభివృద్ధి నమూనాతో చరిత్ర సృష్టిస్తున్న ఈ తెలంగాణ గడ్డ మీ రాజకీయాలు, ఆలోచనలను మార్చుకునే అవకాశం ఇస్తోంది. అందరిని కలుపుకు పోయే భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్పూర్తితో అభివృద్ధి ఏజెండాను చర్చించేందుకు తెలంగాణకు మించిన గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదు. అయితే మీ విధానాలు, నినాదాలను మార్చుకుంటారో లేదంటే, మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుంటారో మీ ఇష్టం.

అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు. కానీ, మీ అస్తవ్యస్థ విధానాలు, అసమర్థ పాలనతో కలుగుతున్న దుష్పరిణామాలను అనుభవిస్తున్న ఈ దేశ పౌరుడిగా ఈ మాత్రం ఆశించడం అత్యాశ కాదనుకుని మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. దేశానికి సరికొత్త దిశను నిర్దేశిస్తున్న తెలంగాణ విజయాలను అధ్యయనం చేయడానికి ఈ రెండు రోజుల సమయం మీకు సరిపోదని తెలుసు. కానీ, మీ కేంద్ర ప్రభుత్వమే శబ్బాష్ అని మెచ్చుకున్న తెలంగాణ విజయాలను గుర్తు చేస్తున్నాను. ఇప్పటికే మీరు ప్రవేశపెట్టిన పలు పథకాలకు మా తెలంగాణ రాష్ట్రం యొక్క కార్యక్రమాలే స్ఫూర్తి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అందుకే ఆవో..దేఖో… సీకో(రండి-చూడండి-నేర్చుకొండి)అంటున్నాం.

జీవనదులున్న మన దేశంలో వేల టిఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే… నదికే పునర్జన్మనిచ్చి సంవత్సరం పొడవునా జలధారాలతో పుడమి తల్లిని మురిపిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి దేశ సాగునీటి రంగాన్ని ఎలా బలోపేతం చేయాలో నేర్చుకోండి. తెలంగాణ ప్రాజెక్టులు స్వరాష్ట్రంలో పూర్తైన వైనాన్ని కళ్లారా చూడండి. మీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు తెలంగాణ సాగునీటి రంగ పురోగతిని కేస్ స్టడీలా చూపించండి. 46వేల చెరువులకు పునర్జన్మనిస్తూ భూగర్భ జలాల సంరక్షణలో అల్ ఇండియా అధికారులకు శిక్షణపాఠంగా మారిన మిషన్ కాకతీయ విజయ గాథను తెలంగాణ మట్టి మనుషులు చెపుతారు ఓపిగ్గా విని తెలుసుకోండి. మీ బూటకపు డబుల్ ఇంజిన్ తో ప్రజలకు ట్రబుల్ గా మారిన మీ రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ప్రయత్నించండి.

వ్యవసాయాన్ని కార్పొరేట్ లకు అప్పగించే కుట్రలను ఎదురించి సాగును పండుగలా మార్చి, అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సర్కార్ మాది. 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు భీమా పథకాలు, రైతువేదికలతో అన్నదాత తలరాత మారుస్తున్న మా ప్రభుత్వ సంకల్పాన్ని చూసైనా ఈ దేశ వ్యవసాయ రంగంపై మీ ప్రభుత్వానికి ఉన్న కక్షాపూరిత వైఖరిని మార్చుకోండి. మా రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి ప్రారంభించిన మీ పియం కిసాన్ యోజనలో గత మూడు సంవత్సరాలుగా కొత్త రైతులకు అవకాశం ఇయ్యకుండా, ఎకరానికి కేవలం 6వేలతో సరిపుచ్చుతున్న మీ విధానాన్ని సవరించి, దేశ రైతాంగానికి మరింత చేయూతనివ్వండి.

75 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న భారతం ఓ వైపునుంటే… గడప ముందట గోదారమ్మ, కృష్టానమ్మల జలధారాల సవ్వడితో మెరుస్తున్న ఆడబిడ్డల ముఖాలు తెలంగాణలో కనిపిస్తాయి. తరతరాలుగా తిష్ట వేసుకుని కూర్చున్న ప్లొరైడ్ రక్కసిని తెలంగాణ నుంచి మేం తరిమికొట్టిన తీరును మీరు కచ్చితంగా తెలుసుకోండి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి నీరు అందిస్తున్న తొలి రాష్ర్టం తెలంగాణ ఘనతను గుర్తించి, మీరు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బిందెడు నీళ్ల కోసం ప్రాణాలు పణంగా పెట్టి బావుల్లోకి దిగుతున్న ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు మా మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకోండి.

2018లోనే ప్రతి గ్రామానికి కరెంటు ఇచ్చామంటూ మీరు చెప్పిన అబద్దాలను దేశం ముందు నిలబెట్టేలా, మీ పార్టీ తరపున దేశ ప్రథమ పౌరులిగా పోటీ చేస్తున్న ద్రౌపతి ముర్ము సొంత గ్రామంలో కరెంటు రాని పరిస్థితి మీ దగ్గరున్నది. స్వయంగా మీ సొంత రాష్ర్టం గుజరాత్ లో కరెంటు సరఫరా చేయలేక చేతులెత్తేసి పవర్ హలీడేలు ప్రకటిస్తున్న పరిస్ధితి ఉంటే… కనురెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల విద్యుత్ తో నిత్యం ప్రకాశిస్తున్న తెలంగాణ మా దగ్గరుంది. మీ అసమర్ధ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో చీకట్లు ఎలా తొలగించాలో తెలుసుకోండి.

తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క నవోదయ పాఠశాలను కేటాయించకున్నా సూమరు 1000 గురుకులాలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా కార్పోరేట్ విద్యను అందిస్తున్న సరస్వతి దేవి కొలువైన గడ్డ ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ సదుపాయాలు కల్పించడంతో పాటు విదేశీ విద్య కోసం స్కాలర్ షిప్పులు ఇస్తున్న రాష్ట్రం మాది. అద్భుతమైన వ్యక్తిత్వం, సాటిలేని పోటీతత్వంతో కూడిన రేపటి తరాలను తీర్చిదిద్దుతున్న మా విద్యా విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలుచేయడానికి ప్రయత్నించండని" మోదీని మంత్రి కేటీఆర్ కోరారు.

Next Story