కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 Feb 2024 12:43 PM IST
telangana, minister komati reddy,  kcr, brs ,

కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి: మంత్రి కోమటిరెడ్డి 

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ పార్టీ నల్లగొండలో సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్‌ సభ గురించి మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ నల్లగొండకు వచ్చే ముందే ముక్కు నేలకు రాయాలనీ.. ఆ తర్వాతే నల్లగొండలో అడుగుపెట్టాలని అన్నారు. నల్లగొండను కేసీఆర్ నాశనం చేశారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు కేసీఆర్‌ అధికారంలో ఉన్న సమయంలో చేసిందేమీ లేదని అన్నారు. ఇక్కడ కుర్చీ వేసుకుని మరీ ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తానని మాట ఇచ్చారనీ.. కానీ ఆ తర్వాత కనీసం దాని ఊసే ఎత్తలేదని అన్నారు. మాట తప్పి నల్లగొండ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. అసలు నల్లగొండను నాశనం చేసిందే బీఆర్ఎస్‌ పార్టీ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. అలాంటిది ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ నల్లగొండకు వస్తున్నారనీ ప్రశ్నించారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసిన తర్వాతే నల్లగొండలో అడుగుపెట్టాలన్నారు. బీఆర్ఎస్ సభ రోజున ఇక్కడికి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. ఆ తర్వాతే ప్రసంగం చేయాలని అన్నారు. ఇక కేసీఆర్ నల్లగొండకు చేసిన అన్యాయంపై నిరసనలు చేపడతామనీ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి.. కేసీఆర్ కోసం కుర్చీ, పింక్ టవల్, ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలవి అనవసర ఆరోపణలు అన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రాష్ట్ర బడ్జెట్‌ ప్రజాయోగ్యమైందని చెప్పారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు చెప్పారు. కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలనీ అన్నారు. కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టింది కేసీఆర్, హరీశ్‌రావే అని గుర్తు చేశారు. తాము తప్పు చేసినట్లుగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హితవు పలికారు.

Next Story