తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి ఉన్నత విద్యను అభ్యసించి పేదలకు సేవ చేయాలని బావించింది. చదువుకునేందుకు కెనడా వెళ్లింది. అయితే.. గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
మల్కాపూర్(ఏ) గ్రామ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి కూతురు పూజితారెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. పీజీ చేసేందుకు జనవరి 26న ఆమె కెనడా వెళ్లింది. అన్నయ్య అరుణ్‌రెడ్డి ఇంట్లో కొద్ది రోజులు ఉంది. ఇటీవల యూనివర్సిటీలోని హాస్టల్‌కు వెళ్లింది. తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటుంది.
10 రోజుల కిందట ఆమె గుండెపోటుతో తాను ఉంటున్న గదిలో కుప్పకూలింది. వెంటనే మిగతా స్నేహితులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆమె మృతదేహాన్ని సోమవారం స్వగ్రామం మల్కాపూర్ కు తీసుకువచ్చారు. ఉన్నత విద్య కోసం ఎంతో ఆశగా విదేశాలకు వెళ్లి అక్కడే తిరిగిరాని లోకాలకు వెళ్లిన కూతురు మృతదేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది.