క్రిప్టో కరెన్సీని నమ్మి 70 లక్షలు కోల్పోయిన తెలంగాణ వ్యక్తి.. ఏ నిర్ణయం తీసుకున్నాడంటే.!

Telangana man dies by suicide after losing money in cryptocurrency. క్రిప్టోకరెన్సీలో డబ్బులు పోగొట్టుకున్నానన్న బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మంకు చెందిన జి. రామలింగస్వామి (36)

By అంజి  Published on  25 Nov 2021 4:45 PM IST
క్రిప్టో కరెన్సీని నమ్మి 70 లక్షలు కోల్పోయిన తెలంగాణ వ్యక్తి.. ఏ నిర్ణయం తీసుకున్నాడంటే.!

క్రిప్టోకరెన్సీలో డబ్బులు పోగొట్టుకున్నానన్న బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మంకు చెందిన జి. రామలింగస్వామి (36) సూర్యాపేట పట్టణంలోని ఓ లాడ్జిలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో ఉంటున్న వ్యక్తి తలుపు తట్టినా స్పందించడం లేదని లాడ్జి యజమాని ఫిర్యాదు చేయడంతో బుధవారం అర్థరాత్రి పోలీసులు అక్కడికి వచ్చారు. తలుపులు తెరచి చూడగా అతడు చనిపోయి పడి ఉన్నాడు.. అతని మృతదేహాన్ని గది నుండి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఆ వ్యక్తి మంగళవారం ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి తన భార్య కోసం వదిలిపెట్టిన సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి క్రిప్టోకరెన్సీ యాప్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టాడు. మొదట్లో రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి మంచి రాబడి వచ్చిందని.. ఆ తర్వాత పెట్టుబడులు భారీగా పెట్టడం.. ఒక్కసారిగా నష్టపోవడం జరిగినట్లు తెలుస్తోంది. అప్పుల ద్వారా సేకరించిన రూ.70 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. దేశంలో చాలా మంది క్రిప్టో కరెన్సీలో డబ్బులను పెట్టి పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం అని నిపుణులు చెబుతూ ఉంటారు.

Next Story