తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత‌

Telangana Lockdown. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on  19 Jun 2021 10:06 AM GMT
తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత‌

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈరోజు మ‌ధ్యాహ్నం స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ ఈ మేర‌కు నిర్ణ‌యించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ కూడా ఉండబోదని తెలుస్తోంది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,24,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,417 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 149, రంగారెడ్డి జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 93 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో రెండు కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,546 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,10,834 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 5,88,259 మంది ఆరోగ్యవంతులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 19,029 చికిత్స పొందుతున్నారు.


Next Story