కారణం లేకుండా బయట కనిపిస్తే ఐసోలేషన్‌కే.. అతి చేస్తే తాట తీస్తున్న పోలీసులు
Telangana Lockdown. లాక్ డౌన్ సమయంలో ఇళ్లల్లో ఉండడయ్యా అంటూ ప్రభుత్వం, పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా
By Medi Samrat Published on 6 Jun 2021 8:30 PM ISTలాక్ డౌన్ సమయంలో ఇళ్లల్లో ఉండడయ్యా అంటూ ప్రభుత్వం, పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కూడా కొందరు కనీసం చెవిన వేసుకోవడం లేదు. ఫైన్లను కట్టడానికి కూడా రెడీ అంటూ సిద్ధమై రోడ్ల మీదకు వస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ఖాళీగా ఉన్న రోడ్లపై ఓ రౌండేసి వద్దామని అనుకుంటున్న వారికి తెలంగాణ పోలీసులు ఊహించని ఝలక్ ఇస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అనవసరంగా బయట తిరిగే యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయట తిరుగుతున్న 14 మంది ఆకతాయిలకు కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించి, ఐసోలేషన్‌కు తరలించారు. జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎలకంటీ, షేట్ పల్లి, గ్రామాలలో పెట్రోలింగ్ చేస్తుండగా కొందరు బయట తిరుగుతూ పోలీసులకు చిక్కారు. ఓ 14 మందిని పట్టుకొని వారికి రాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ వచ్చినా నిబంధనలు ఉల్లంఘించినందుకు బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. జైపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో అనవసరంగా బయట తిరిగే వ్యక్తులకు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని లేదంటే ఐసోలేషన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. కాబట్టి బయట అనవసరంగా తిరిగే వారి బెండు పోలీసులు తీస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారిని, ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాలీబాల్ ఆడుతున్న యువకులను పట్టణ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయా కాలనీల్లో షాపు యజమానులను సైతం స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న యుకకులకు ఎక్కడ దొరికిన వారికి అక్కడే కరోనా టెస్టులు చేస్తున్నారు. అనంతరం ఐసోలేషన్ కు తరలిస్తున్నారు.