తెలంగాణలో భూ వివాదాలకు చెక్..రేపటి నుంచే 'భూభారతి' పోర్టల్ పైలట్ ప్రాజెక్ట్!

తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన 'ఇంటిగ్రేటెడ్ భూభారతి' పోర్టల్‌ను రూపొందించింది.

By -  Knakam Karthik
Published on : 1 April 2026 5:27 PM IST

Telangana, BhuBharathi, LandReforms, Revenue Department, Farmers, LandSurvey, BhuAadhaar, Congress Govt

తెలంగాణలో భూ వివాదాలకు చెక్..రేపటి నుంచే 'భూభారతి' పోర్టల్ పైలట్ ప్రాజెక్ట్!

తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన 'ఇంటిగ్రేటెడ్ భూభారతి' పోర్టల్‌ను రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ సిద్ధం చేసిన ఈ పోర్టల్‌ను ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలోని ఐదు మండలాల్లో (కుసుమంచి, అశ్వారావుపేట, అమన్‌గల్, వట్‌పల్లి, కొస్గి) ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.

ఈ విధానం ద్వారా రైతులు ఇకపై మీసేవ కేంద్రాలకు లేదా సర్వే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ ఇంటి నుంచే భూ సేవలు పొందవచ్చు. రైతు తన లాగిన్ ద్వారా భూమి వివరాలను చూసుకోవడంతో పాటు, సర్వే కోసం అవసరమైన ఫీజు చెల్లిస్తే లైసెన్స్‌డ్ సర్వేయర్ నేరుగా పొలానికి వచ్చి ఆధునిక రోవర్ల ద్వారా సర్వే నిర్వహిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూమికి 'భూధార్' నంబర్ మరియు 'ఎల్పీఎం' (సర్వే మ్యాప్) కేటాయించబడతాయి.

రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే కొత్త నిబంధనను కూడా ఈ మండలాల్లో అమలు చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి సర్వే పూర్తయ్యే వరకు ప్రతి దశలో రైతుకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. పాత పద్ధతులకు స్వస్తి పలికి పారదర్శకంగా, త్వరితగతిన భూ సమస్యలను పరిష్కరించడమే ఈ పోర్టల్ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Next Story