Telangana: లగచర్ల ఘటన రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
వికారాబాద్ లగచర్ల ఘటనకు సంబంధించి పోలీస్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి.
By అంజి Published on 13 Nov 2024 1:15 PM ISTTelangana: లగచర్ల ఘటన రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
వికారాబాద్ లగచర్ల ఘటనకు సంబంధించి పోలీస్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిపై వివిధ సెక్షన్-3 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఏ-1గా భోగమోని సురేష్ పేరు చేర్చారు. పరారీలో ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు మరో 29 మంది ఉన్నారు. అధికారులపై హత్యాయత్నం జరిగిందని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని పేర్కొన్నారు. ముందుగానే కారం, రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు.
సురేష్‌రాజ్.. వికారాబాద్ కలెక్టర్ వద్దకు వచ్చి సమావేశానికి రైతులు ఎవరూ రారని, కలెక్టర్‌నే తమ గ్రామానికి రావాలని కోరాడని, దీంతో అధికారులు అంతా లగచర్ల గ్రామానికి చేరుకున్నారని, ప్రజాభిప్రాయం కోసం గ్రామంలోకి వెళ్ళిన అధికారులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం అడిషనల్ కలెక్టర్ లింగనాయక్, ఇంచార్జ్ కలెక్టర్ ఉమాశంకర్, దుద్యాల్ తహసిల్దార్ కిషన్ నాయక్ జయకుమార్ కొడంగల్ తహసిల్దార్ విజయనాయక్ వెళ్లారు.
ఆ తర్వాత వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి సమావేశానికి వచ్చారు. రైతులతో అధికారులు మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా కొందరు ఒక్కసారిగా దాడికి యత్నించారు. రాళ్లు, కర్రలతో అధికారులను వెంబడించి మరీ దాడి చేశారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డగించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాళ్లు విసిరి, ఆపై దాడికి దిగారు. సురేష్ ప్లాన్ ప్రకారమే.. కలెక్టర్‌ను లగచర్లకు తీసుకెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. దాడికి పాల్పడ్డ నిందితులపై సెక్షన్ 61(2),191 (2)(3),132,109,121(1),126 (2),324(4)రెడ్ విత్ 190, సెక్షన్ 3PDPP యాక్ట్, సెక్షన్ 128 బీఎన్ఎస్ఎస్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.