బీఆర్ఎస్ అవినీతిపై కాళేశ్వరం డమ్మీ ఏటీఎంతో కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 31 Oct 2023 7:57 AM GMTబీఆర్ఎస్ అవినీతిపై కాళేశ్వరం డమ్మీ ఏటీఎంతో కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించి అధికారం నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే.. ఈసారైనా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దింపి తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సర్కార్ అవినీతిపై వినూత్న ప్రచారానికి దిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయాల అవినీతి పాల్పడిందంటూ బీఆర్ఎస్ సర్కార్‌పై.. కాంగ్రెస్ మొదట్నుంచి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై కాంగ్రెస్ ఒక డమ్మీ ఏటీఎం రూపొందించింది. కాళేశ్వరం ఏటీఎం అని పేరుపెట్టి వినూత్న ప్రచారం నిర్వహిస్తోంది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కొందరు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ.. ప్రత్యేకంగా కాళేశ్వరం ఏటీఎంల పేరుతో ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ కాళేశ్వరం ఏటీఎంలను నగరంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం తమకు ఏటీఎంలా మార్చుకుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో చూడాలంటూ పలువరు ప్రజలకు వివరిస్తున్నారు. అయితే.. ఆయా ఏటీఎంలపై కేసీఆర్ పేరుని.. K-కాళేశ్వరం C- కరెప్షన్ R -రావుగా నిర్వచించారు. అంతేకాదు ఏటీఎంపై కేసీఆర్.. డబ్బుల ఫొటోలను ముద్రించి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం కరప్షన్ రాకెట్ బ్యాంక్.. అలాగే కేసీఆర్ పేరుతో లక్ష కోట్ల నోటును రిలీజ్ చేశారు. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం అంటూ ఏటీఎంపై పేర్కొన్నారు. ఇంత పెద్దఎత్తున ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన వారికి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు.
కాగా.. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. దాంతో.. లక్ష కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టు.. కేవలం నాలుగేళ్లకే కుంగిపోవడంపై విమర్శలు వెల్లివెత్తాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసాయి. కేంద్రం ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. ఇదిలా నడుస్తుండగానే.. ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏటీఎం రూపొందించి ప్రచారం చేస్తున్నారు. దాంతో.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
#Hyderabad - బీఆర్ఎస్, కేసీఆర్ అవినీతిని ఎత్తిచూపేందుకు కాంగ్రెస్ డమ్మీ ఏటీఎం..‘కాళేశ్వరం ఏటీఎం’ను రూపొందించింది.ఆ పార్టీ.. కేసీఆర్‌ను 'కాళేశ్వరం కరప్షన్‌రావు' అంటూ విమర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1,00,000 కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ,… pic.twitter.com/k7p79HrXfs
— Newsmeter Telugu (@NewsmeterTelugu) October 31, 2023